హీరోలను డామినేట్ చేసిన సూర్యకాంతం...!
గయ్యాళి అత్త... టాలీవుడ్ లో ఈ మాట వినపడగానే మనకు గుర్తుకు వచ్చేది సూర్యకాంతం. తెలుగు సినీ పరిశ్రమ చూసి అతి కొద్ది మంది గొప్ప నటుల్లో ఆమె ఒకరు. ఏ హీరో సినిమా అయినా ఏ హీరోయిన్ సినిమా అయినా సరే సూర్య కాంతం లేని సినిమా ఉండేది కాదు. ఆమె పాత్రకు ఉండే ప్రాధాన్యత కూడా అంతే. సినిమాను ఒంటి చేత్తో ముందుకు నడిపించిన ఘనత ఆమె సొంతం. ఎలాంటి పాత్రలో అయినా సరే జీవిస్తారు అనే పేరు ఆమెకు సొంతం. ధర్శకులకే పాఠాలు నేర్పిన నటి సూర్యకాంతం.
సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ఎక్కువగా హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. నాటి నుంచి నేటి వరకు కూడా మన తెలుగు సినిమాల్లో వాళ్ళదే హవా. కాని సూర్యకాంతం మాత్రం హీరోలను డామినేట్ చేసారు. సూర్య కాంతం నటిస్తుంటే ఎన్టీఆర్, అక్కినేని నటన కంటే ఆమె నటననే ఎక్కువగా చూసే వారు. ఆమె పాత్ర గురించి చర్చలు కూడా జరిగేవి. ఆమెను ఒక ఇంట్లో మనిషిగా చూసారు జనం. ఇక ఆమె పాత్ర విషయంలో దర్శకులు, రచయితలు రాసే మాటలు, ఆమె నోటి నుంచి వచ్చిన కొన్ని పలుకులు అయితే,
ఇంటికి వచ్చిన తర్వాత కోడళ్ళను కూడా భయపెట్టేవి. ఆమెను చూసి స్ఫూర్తి పొంది కోడళ్ళను వేధించిన అత్తలు కూడా ఉండే వారు. ఆమె నోట్లో నుంచి వచ్చే ఆంధ్రా యాస గురించి ప్రత్యేకంగా చెప్పుకునే వారు అప్పట్లో. చాలా మంది హీరోలు ఆమెతో పోటీ పడి నటించడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళు. హీరోయిన్ లు అయితే మాకు గుర్తింపు రావడం లేదు ఆమె సీన్ లో ఉంటే అని బాధపడిన సందర్భాలు కూడా ఉండేవి. ఆమె కళ్ళ జోడు ఆమె ఆహార్యం ఇలా అన్నీ కూడా తెలుగు సినిమాలో అలా నిలిచిపోయాయి.