అమ్మ : మీలో ఎంతమందికి మీ అమ్మ పుట్టినరోజు తెలుసు..???

Suma Kallamadi
అమ్మ అన్న మాటలో ఎంతో ఆప్యాయత ఉంది.మనం పలికే ప్రతి మాటలోను అమ్మ ఉంటుంది. మాతృత్వపు మమకారం మాటలకు అందనిది. అమ్మతనపు గొప్పదనం అక్షరాలకు అతీతం.. అమ్మ పాత్ర కుటుంబ వ్యవస్థలో అత్యంత కీలకం. అంటూ ఎంతగా అభివర్ణించినా అది తక్కువే..ఒక పక్క ఇంటి బాధ్యతలు, ఉద్యోగం, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఇలా ఒకటి ఏమిటి అన్ని తానై ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది అమ్మ..ఆమె పాలనలో ఇల్లంతా చల్లగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా నిరంతరం నిశ్చింతగా ఉంటారు. ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తనే కొంగు బిగిస్తుంది.

ఆకాశమంత విశాల భావాలు, సాగరమంత లోతైన ఆలోచనలు, అవనిని మరపించే క్షమాగుణం అమ్మకు పెట్టని ఆభరణాలు. ఒంట్లో ఓపిక లేకున్నా, ఇంట్లో ఏదీ లేకున్నా ‘నావల్ల కాదు’ అని ఆమె ఎప్పుడూ నిస్తేజంగా, నిస్సహాయంగా ఉండిపోదు. ఉన్న దాంతోనే వండి ఇంటిల్లిపాదికీ వడ్డించడంలో ఆమె నేర్పుకు జోహార్లు.ఆ మమకారానికి ముగింపు లేదు, ఆ సేవకు విశ్రాంతి ఉండదు.అందుకేనేమో మన పెద్దవాళ్ళు అంటారు "ఇంటికి దీపం ఇల్లాలు అని" బిడ్డ పుట్టినప్పటి నుండి పెద్ద అయ్యేదాకా ప్రతి విషయంలోనూ అమ్మ పాత్ర చాలా గొప్పది.. బిడ్డ ఎదుగుదలను చూసుకుని మురిసిపోతుంది అమ్మ. బిడ్డకి చిన్న కష్టం వచ్చిన చాలు విల విల లాడిపోతుంది. మనం కడుపులో పడ్డామని తెలిసిన అప్పటినుండి మన కోసమే ఆలోచిస్తుంది. పుట్టాక కూడా మన ఎదుగుదలనే కోరుకుంటుంది. తనకు కట్టుకోడానికి మంచి చీర లేకపోయినా తన బిడ్డ మంచి బట్టలు వేసుకోవాలని తాపత్రయపడుతుంది.. మన పుట్టినరోజుని ఒక వేడుకలగా చేస్తుంది.


కానీ మనం అమ్మ పుట్టినరోజున కనీసం ఒక్క చీర అయిన బహుమతిగా ఇచ్చామా.. !! మనం ఇచ్చే చీర కూడా ఆశించదు అమ్మ కానీ బిడ్డ ఆప్యాయంగా అమ్మ దగ్గరకు వచ్చి చేయిపట్టుకుని శుభాకాంక్షలు చెబితే చాలు.. అప్పుడు ఆ అమ్మ కళ్ళలో కనిపించే ఆనందం మనం ఎక్కడ వెతికిన కనపడదు.. ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్.. మిలో ఎంతమంది అమ్మకు  పుట్టినరోజు  శుభాకాంక్షలు చెప్పేవాళ్ళో.. కనీసం కొంతమందికి అమ్మ ఇప్పుడు పుట్టిందో కూడా తెలియదు...కానీ అమ్మ తన చివరి శ్వాస వరకు బిడ్డ పుట్టిన క్షణాన్ని మర్చిపోదు... !!Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: