గర్భిణులు ఆ వాతావరణంలో ఉంటే డేంజర్..!

N.ANJI
గర్భిణులు అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల తీవ్రతకు ఉన్న ప్రదేశాల్లో తిరగడం వలన ప్రసవం నెలలు నిండక ముందే జరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక ఉష్ణ మండల ప్రాంతాల్లో నివసించే పేదల్లో ఎక్కువ మంది దీని ప్రభావానికి గురవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌తో ఈ సమస్య మరింత పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది. ఈ అధ్యయనాన్ని BMJ మెడికల్ జర్నల్లో ప్రచురించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం కనీసం 15 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండకముందే పుడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.

అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల గత శతాబ్దంలో భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ మేరకు పెరుగుతుంది అని తెలిపారు. దీని వల్ల ప్రపంచ దేశాల్లో వేడి తీవ్రత కూడా పెరుగుతోంది. వేడిగాలులతో పాటు తేమ తీవ్రత ఎక్కువగా ఉండే వాతావరణం మరింత ప్రమాదకరమని పరిశోధకులు వెల్లడించారు. గ్లోబల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీలకు బదులుగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ప్రపంచ వ్యాప్తంగా 420 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన వేడి గాలుల ప్రభావానికి గురవుతున్నారని ఐక్యరాజ్యసమితికి వాతారణ విభాగానికి చెందిన IPCC సంస్థ 2018లో వెల్లడించిన నివేదికలో పేర్కొన్నారు.

ఇక ఉష్ణోగ్రత ఒక డిగ్రీ వరకు పెరిగితే ముందస్తు జననాలు ఐదు శాతం వరకు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. పేద మహిళలపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. దీని వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. దీంతో దీర్ఘకాలంలో పిల్లలు ఇతర అనారోగ్యాలకు గురయ్యే ప్రభావం ఉంది. అందువల్ల గర్భిణులు సాధ్యమైనంత వరకు ఇలాంటి వేడి గాలుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాలుష్యం వంటి ఇతర అంశాలు కూడా ముందస్తు ప్రసవాలకు కారణం కావచ్చు. మరిన్ని పరిశోధనలు, హెల్త్ పాలసీలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే ముందస్తు ప్రసవాలను నిరోధించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: