అమ్మలందరికీ ఓపెన్ లెటర్.. టెన్నిస్ స్టార్ సానియా మాటలివీ!

P.Phanindra
భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పేరు తెలియని వారు చాలా అరుదు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియా.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అంతర్జాతీయ టైటిల్ గెలిచి, చాలామంది తల్లులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచంలోని తల్లులందరినీ ఉద్దేశిస్తూ ఓ ఓపెన్ లెటర్ రాసింది. 2018లో బిడ్డ ఇజాన్ మిర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత టెన్నిస్‌లోకి తిరిగి అడుగు పెట్టిన ఆమె హోబర్ట్ ఇంటర్నేషనల్ వుమెన్స్ డబుల్స్ టైటిల్ సాధించింది.
అమెరికా టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పింది. సెరెనా కూడా తల్లయిన తర్వాత టెన్నిస్ ఆడి అద్భుతంగా రాణించింది. సెరెనా జర్నీ తనలో ఎంతగానో స్ఫూర్తి నింపిందని, ఆమెపై తీసిన డాక్యుమెంటరీ తనను కదిలించి వేసిందని సానియా వెల్లడించింది. అలాగే అమ్మాయిలను క్రీడా కారులుగా చేయాలని తల్లిదండ్రులు అసలు అనుకోరని, అయినా జీవితంలో విజయాలు సాధించ వచ్చని ఆమె చెప్పింది. అయితే మన శక్తిని మనమే అనుమానించే పరిస్థితి వస్తే మాత్రం పరిస్థితి చేయి దాటిపోయినట్లే అని తెలిపింది. తల్లవడం గురించి కూడా సానియా తన లేఖలో పేర్కొంది. ప్రతి అమ్మాయీ గర్భం దాల్చాలని, అది మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తుందని, అలాగే స్వార్థం లేని ప్రేమ ఎలా ఉంటుందో మనకు పరిచయం చేస్తుందని తెలిపింది.
అలాగే గర్భం సమయంలో తాను 23 కేజీల బరువు పెరిగానని, ఆ తర్వాత మళ్లీ ఫిట్‌గా మారి ఆడటంపై తనకే సందేహాలు వచ్చాయని చెప్పింది. అయితే చాలా కష్టమైన వర్కవుట్స్ చేసి 26 కేజీలు బరువు తగ్గి, హోవర్డ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలవడం అద్భుతమైన అనుభవమని పేర్కొంది. ‘‘యాన్ ఓడ్ టూ ఆల్ మదర్స్’’ పేరుతో సానియా ఈ లేఖ రాసింది. దీన్ని  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే.. ఇప్పటి వరకూ సుమారు 60వేల లైకులు వచ్చాయి. వీటితో పాటు వందలాది మంది కూడా తమ అభిప్రాయాలను పంచుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అయిన సానియా తన కెరీర్‌లో 6 గ్రాండ్ స్లాములు గెలిచింది.
​సానియా {{RelevantDataTitle}}