టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

P.Phanindra
ఎడారి రాజ్యం సౌదీ అరేబియాలో మహిళల హక్కుల కోసం పోరాడిన ఉద్యమ కారిణి, ఆడవారికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని ఉద్యమం చేసిన మహిళ ప్రస్తుతం సౌదీ జైల్లో మగ్గుతోంది. ఈమెపై 2019 మార్చి నుంచి విచారణ కొనసాగుతోంది. ఈమె పేరు ఆల్-హాత్‌లోల్. 31 ఏళ్ల హాత్‌లోల్.. మహిళల హక్కుల కోసం చాలా ఉద్యమాలు చేసింది.
ఈ క్రమంలోనే సౌదీ శత్రు దేశాలతో హాత్‌లోల్‌కు డీలింగ్స్ ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేశారు. గతేడాది మార్చి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు సడెన్‌గా ఆమెపై నమోదైన కేసును సాధారణ కోర్టులో విచారించే హక్కు లేదని న్యాయమూర్తి పేర్కొన్నారట. ప్రత్యేక న్యాయస్థానానికి ఈ కేసును పంపుతున్నట్లు ప్రకటించారట. ఈ ప్రత్యేక న్యాయస్థానంలో సాధారణంగా టెర్రరిస్టులు, దేశ ద్రోహులకు సంబంధించిన కేసుల విచారణ జరుగుతుందని సమాచారం. అగ్ర రాజ్యం అమెరికాలో ట్రంప్ సర్కారు.. మహిళల హక్కుల గురించి పెద్దగా పట్టించుకోదు. అయితే  ఈసారి ఎన్నికల్లో గెలిచిన బైడెన్ మాత్రం సౌదీతో సత్సంబంధాలు ఉండేలా చూస్తానని ప్రచారం సమయంలో వాగ్దానం చేశారు.
దీంతో బైడెన్ వైట్‌హౌస్‌లోకి వెళ్లే సమయంలో హాత్‌లోల్‌ను విడుదల చేసేస్తారని అందరూ భావించారు. అయితే సౌదీ ప్రభుత్వం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది. సడెన్‌గా ఆమెను టెర్రరిస్టు కోర్టుకు పంపాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం మొత్తం ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం అని కొందరు వాదిస్తున్నారు. మరి హాత్‌లోల్ కేసు ముందు ముందు ఎటువంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
సౌదీలో ప్రస్తుతం మహిళలు డ్రైవింగ్ చేస్తున్నారన్నా, వారికి ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ లైసెన్సులు లభిస్తున్నాయన్నా అది మొత్తం హాత్‌లోల్ చలవే. మహిళలూ డ్రైవింగ్ చేయగలరంటూ ఆమె సౌదీలో పెద్ద ఉద్యమమే చేసింది. దీని ఫలితంగానే ఎడారి రాజ్యం మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: