ఇంకా ఆగని బాల్య వివాహాలు.. ఆ రాష్ట్రంలో అయితే మరీ!

P.Phanindra
సమాజం ముందుకు పోతున్నా కూడా అందరూ మారడం లేదు. ఇంకా పాత సంప్రదాయాలు, ఆచారాలు అంటూ అమ్మాయిల జీవితాలను అంధకారం చేస్తున్నారు. దీనికి పెద్ద ఉదాహరణ ఇటీవల జరిగిన ఓ సర్వే. భారత దేశ చట్టాల ప్రకారం 18 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న యువతులు వివాహం చేసుకోవడానికి అనర్హులు. కానీ తాజా సర్వేలో తేలిన విషయాల ప్రకారం, భారత్‌ లో అత్యధిక కోటీశ్వరులకు జన్మనిచ్చిన గుజరాత్ రాష్ట్రంలో ఈ నిబంధనలను ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) లో ఈ దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. ఇక్కడ మరో కళ్లు తిరిగే విషయం ఏంటంటే.. ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్లు అయిపోయాయి. అంతేకాదు, వీరిలో 5.2 శాతం మంది గర్భవతులు కూడా. అలాగే పురుషుల్లో కనీస వివాహ వయసు 21 అయితే.. ఈ రాష్ట్రంలోని 27.7 శాతం మంది యువకులు ఆ వయసు రాకముందే పెళ్లి చేసుకుంటున్నారట. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ బాల్య వివాహాలు ఎక్కువగా చేస్తున్నారని సర్వేలో తేలింది.
గ్రామీణ ప్రాంతాల్లోని 26.9 శాతం మంది బాలికలు, 33.9 శాతం మంది యువకులకు కనీస అర్హత వయసు రాకముందే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయంట. వీరిలో కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులోని అమ్మాయిలకే పెళ్లి చేసేస్తున్నారని తెలిసింది. వీరిలో కూడా 6.7 శాతం మంది కనీస వివాహ వయసు వచ్చే లోగానే గర్భవతులు అయిపోతున్నారు. ఈ నిష్పత్తి అర్బన్ ప్రాంతాల్లో 2.6 శాతంగా ఉంది. అంటే పట్టణాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్న మాట. అంతేకాదు.. ప్రస్తుతం పెళ్లిళ్లు అయిపోయి, 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో 21.8 శాతం మంది తమకు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లి జరిగినట్లు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: