అమ్మ ఇచ్చిన వెయ్యి రూపాయిలతో కోట్లకు అధిపతి అయిన కోటి రెడ్డి !
అమ్మ.. సృష్టికి జీవం పోసిన రెండక్షరాల ప్రేమ.. భగవంతుడు అనునిత్యం మనకు తోడు ఉండలేక ఆయన ప్రతిరూపంగా అమ్మను సృష్టించాడు. ఇక ఈ లోకంలో అన్నింటి కన్నా అమూల్యమైనది , అతి మధురమైనది, అనంతమైనది అమ్మ అనురాగం మాత్రమే.. ఈ ప్రపంచంలోనే కాదు ముల్లోకాలలో కూడా అమ్మను మించిన దైవం, అమ్మను మించి ప్రేమగా చూసుకునే వారు ఎక్కడా దొరకరు. ఇక పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.ఆ అమ్మ చల్లని ఒడిలో మొదలైందే మనజన్మ. అమ్మ పిల్లల రేపటి భవిష్యత్తు పై నిత్యం శ్రమించే శ్రామికురాలు.. తమ జీవితాలను తమ బిడ్డలకు ధారపోసే ఏకైక వ్యక్తి మాతృమూర్తి. ఈ సృష్టిలో ఉన్న మాతృ మూర్తులందరికీ అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు మనం ఒక అమ్మ గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. అలా ఎందుకు ఆ అమ్మ గురించి తెలుసుకోవాలి ? అందరి అమ్మలు స్పెషలే కదా ! అంటే, అవును నిజమే.. తల్లి ప్రేమ లో ఎలాంటి కల్లాకపటం ఉండదు. కానీ ఇప్పుడు అందరి కంటే కొంత భిన్నంగా ,తన కొడుకు ను ఉన్నత స్థాయిలో చూడాలని ఓ తల్లి చేసిన కష్టం, అందుకు ప్రతిఫలం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కోటిరెడ్డి సరిపల్లి.. ఈ పేరు వినగానే చాలా మందికి అర్థం అయ్యుంటుంది. ఒకప్పటి కూలి పని చేసుకుని బ్రతికిన వ్యక్తి, ఇప్పుడు ఏకంగా పదహారు వందల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. ఈయన ఏకంగా 14 టెక్ సంస్థల సమూహారమైన " కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్" కి అధినేత. కానీ చదివింది మాత్రం పదవ తరగతి. 17 ఏళ్ల వయసులోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా మారారు. రిలయన్స్ తీసుకు వచ్చిన రూ.5 ఫోన్ కి కావాల్సిన సాఫ్ట్ వేర్ రూపకర్తలలో ఒకరు. కేవలం పదవ తరగతి తోనే మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.
ఇక ఈ మైక్రోసాఫ్ట్ రంగంలో రెండుసార్లు "గోల్డెన్ స్టార్ అచీవర్స్ అవార్డు" ను కూడా గెలుపొందారు. ఇక 2014 లో "కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్" ను ప్రారంభించి, తన స్థాయిని మరింత ఉన్నతంగా చేసుకుంటూ, ఎంతోమందికి జీవితాలకు బాసటగా నిలుస్తున్నారు.. ఈ కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ కింద ఆరోగ్యం, విద్య, మీడియా ,ఆర్థిక రంగం ఇలా వివిధ రంగాలకు ఉపయోగపడే 14 సంస్థల్ని దాని కింద ఏర్పాటు చేశారు అవే 14 టెక్ సంస్థలు. అంతేకాకుండా "పినాకిల్ బ్లూమ్స్"అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి, ఇందులో ఆటిజం మాత్రమే కాకుండా మెదడుకు సంబంధించిన ఇతరత్రా సమస్యలు ఉన్న పిల్లలకు పరీక్షలు , వాళ్ళ ఆరోగ్యం ,వాళ్లకి కావాల్సిన శిక్షణ మొత్తాన్ని ఈ సంస్ధ అందిస్తుంది . ఈ సంస్థ ద్వారా పేద పిల్లలకు ఉచితంగా సేవలు అందిస్తారు. అలాగే "కేవీ సేవా ఫౌండేషన్" ను ఏర్పాటు చేసి, మన తెలుగు రాష్ట్రాలలోని 300 స్కూల్స్ ని దత్తత తీసుకున్న ఏకైక వ్యక్తి.. ఇక ఇందులో భాగంగానే ప్రతి స్కూల్ కు కోటి రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. ఈయన తన సంస్థల ద్వారా 1,600 కోట్ల రూపాయలను ఆర్జిస్తుంటే, సుమారు 500 కోట్ల రూపాయలను సేవకే కేటాయిస్తున్నారు. ఎన్ని సాధించినప్పటికీ ఒక సామాన్య వ్యక్తి లాగే ఉంటారు. అంటే "ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండు" అనే సామెతను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని మసులుకుంటారు కోటిరెడ్డి.
ఒక సామాన్య వ్యక్తి ని ఇంత గొప్ప మహానుభావుడు గా చేసిన తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఎవరో కాదు కోటిరెడ్డి సరిపల్లి తల్లిగారు మల్లేశ్వరి.. ఆమె తన కొడుకుకు ఇచ్చిన సంకల్ప ధైర్యమే, తన కొడుకును ఈరోజు ఇలాంటి స్థాయిలో నిలబెట్టడానికి కారణమైంది.
మల్లేశ్వరి గారు పెద్దగా చదువుకోలేదు. చదువు పైన పట్టు లేదు. కానీ ఆమె కొడుకును మాత్రం ఎప్పుడు పాఠ్యగ్రంథాలే కాకుండా బయట పుస్తకాలు కూడా చదవమని సలహా ఇచ్చేవారు." అంగబలం అర్థబలం లేని మనం బుద్ధిబలాన్ని నమ్ముకోవాలి రా అబ్బాయ్ " అని ఎప్పుడూ తన కొడుకుతో చెప్తుండేవారు. తన తల్లి ఇచ్చిన వెయ్యి రూపాయల పెట్టుబడితో పీజీడీసీఏ నేర్చుకొని, కంప్యూటర్ ప్రపంచంలోకి అడుగులు వేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు తన కలలను సాకారం చేసుకునేందుకు, కష్టపడాల్సి వచ్చినా అమ్మ ప్రోత్సాహం.. ఆర్థిక సహాయం.. ఆయన లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకునేందుకు అవకాశం కల్పించాయి. ఇలా తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతోనే "అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం" చేసి చూపించారు. తన సంస్థ రాబడిలో 33 శాతం అంటే దాదాపు రూ. 600 కోట్లను కేవలం సేవ కోసమే కేటాయిస్తున్న వ్యక్తిగా ఘనత సాధించాడు. ఇంత ఘనత సాధించక ముందే ఇతడు అందరిలాగే కూలి పనికి వెళ్లే వాడు. కానీ ఇప్పుడు కేవలం 35 సంవత్సరాల వయస్సులోనే ఎవరూ చేయలేని సాహసాలు చేసి, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు కోటిరెడ్డి సరిపల్లి. ఇక ఇంతటి మహానుభావున్ని సమాజానికి అందించిన తన తల్లికి తప్పకుండా ధన్యవాదాలు తెలపాల్సిందే..