మహిళ: వయసును బట్టి ఈ టెస్ట్ లు తప్పనిసరి ?
* 20-25 ఏళ్ల వయసు వారు
ఈ వయసులో ఉన్న మహిళలు గైనాకాలజిస్టులను కలసి మొత్తం స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం...ఎందుకంటే
కొన్ని సార్లు గర్భాశయం నుండి అనవసరమైన రక్తస్రావం, యోని లో నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తే మీ గైనకాలజిస్టును కలవడం ఉత్తమం. గైనకాలజిస్టు ఇబ్బంది కలిగించే ప్రెగ్నన్సీ, రుతుస్రావం, మరియు మెనోపాజ్ సంతానోత్పత్తి వంటి సమస్యలకు మొదట్లోనే చక్కటి పరిష్కారాలు చెబుతారు. తద్వారా సమస్యలు మరి పెద్దవి కాకుండా ఉంటాయి. అలాగే ఫెర్టిలిటీ చెక్ అప్ కూడా చేయించుకోవాలి..
గర్భం ధరించాలి అనే మహిళలు ఈ టెస్ట్ ద్వారా... గర్భాశయం మరియు అండాశయం యొక్క పనితీరు సక్రమంగా జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందా అని తెలుసుకోవచ్చు.
25 ఏళ్లు పైబడిన వారు...60 ఏళ్ల లోపు వరకు
ఇక ఒకప్పటి కాలంలో అయితే 50 యేళ్లు పై బడితే కానీ బీపి షుగర్లు చెక్ చేయించుకునేవారు కాదు...కానీ ఇపుడు కాలం మారింది మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారింది. గుండె జబ్బుల సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. చిన్న వయసులోనే అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, మానసిక ఒత్తిడి వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి. అలాగే మగవారికి మాత్రమే ఎక్కువగా గుండె జబ్బులు వస్తాయి అనుకోవడం అపోహే అంటున్నారు నిపుణులు. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో ఆడవాళ్ళు కూడా అధికంగానే ఉంటున్నారని చెబుతున్నారు. కాబట్టి మీ వయసు 30 దాటి ఏమైనా గుండె రక్తప్రసరణ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద చేయకుండా ఒకసారి డాక్టర్ ని కలవండి. ఒకవేళ అది సమస్యే అయితే సమస్య కటినం కాకుండా ముందుగానే నియంత్రించవచ్చు. నడిస్తే ఎక్కువ ఆయాసం, మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది అనిపించడం. ఆయాసం, గుండె పట్టేసినట్లు కానీ, భరించలేని నొప్పి కానీ భావాలు అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ ను కలవాలని అంటున్నారు.
40 ఏళ్లు పైబడిన వారు
40 ఏళ్ల పైబడిన మహిళలు మామోగ్రఫి చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ వయసు దాటుతుంది అంటే ముఖ్యంగా మామోగ్రఫి, బిపి, షుగర్ వంటి టెస్ట్ లు ఖచ్చితంగా అవసరమని అని అంటున్నారు. మామోగ్రఫి చేయించుకోవడం వలన రొమ్ములో గడ్డలు లాంటివి ఉంటే ఆ విషయం బయట పడుతుంది. కానీ ప్రతి గడ్డ క్యాన్సర్ కారకాలు కాకపోవచ్చు. వచ్చే రిపోర్టును బట్టి మీ డాక్టర్ మీ ఆరోగ్య పరిస్థితి వివరిస్తారు. ఇది ముందు జాగ్రత్త మాత్రమే టెన్షన్ పడకుండా ఈ వయసు దాటితే మామొగ్రఫి టెస్ట్ చేయించుకుంటే మంచిదని కొందరు నిపుణుల అభిప్రాయం. ఒకవేళ రొమ్ము కాన్సర్ అయినట్లయితే ముందుగా చికిత్స తీసుకొని కొంత వరకు ప్రమాదం తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు.