బ‌తుక‌మ్మ సంబురాలు ఏ రోజు ఎలా జ‌రుపుకుంటారో తెలుసా...?

N ANJANEYULU
సంస్కృతి, సాంప్ర‌దాయాల‌కు, ఆచార వ్య‌వ‌హారాల‌కు భార‌త‌దేశం పెట్టింది పేరు. వాటిని మ‌రిచిపోకుండా భావిత‌రాల‌కు అందించ‌డంలో పండుగ‌ల పాత్ర ప్ర‌ముఖ‌మైన‌ది. తెలంగాణ రాష్ట్రంలో 'బ‌తుక‌మ్మ' పాత్ర విశిష్ట‌మైన‌ది.  అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం 2014 జూన్ 16న దీన్ని రాష్ట్ర పండుగ‌గా గుర్తిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. పువ్వులు, నీరు, ప్ర‌కృతి  ఈ పండుగ‌లో ప్ర‌ధానాంశాలుగా ఉంటాయి. పూర్వ‌కాలంలో తెలంగాణ‌లో వ‌ర్షాలు స‌రిగా రాకపోయేది.  తెలంగాణ ప్రాంతం ఎక్కువ శాతం న‌దుల‌పై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చేది. దీంతో కాక‌తీయులు చెరువుల త్ర‌వ్వ‌కానికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చారు. అప్ప‌ట్లో ప్ర‌తి గ్రామానికి ఒక చెరువు ఉండేది. ఒక‌వేళ గ్రామంలో చెరువు లేక‌పోతే ఆ గ్రామ యువ‌కుల‌కు పిల్ల‌నిచ్చే వారు కాద‌ట‌. దీన్ని బ‌ట్టి చెరువుల‌కు ప్రాధాన్య‌త ఎంత ఉందో అర్థ‌మ‌వుతుంది.
 ఇంత ప్రాధాన్య‌త క‌లిగి, త‌మ జీవితానికి బ‌తుకునిస్తున్న చెరువుల‌కు స్థానికంగా ల‌భించే పువ్వుల‌తో ఆరాధించేవారు. ఇదే బ‌తుక‌మ్మ పండుగ‌గా ప్ర‌సిద్ధి చెందింది. శివుని భార్య పార్వ‌తిదేవికి మ‌రొక పేరే గౌర‌మ్మ‌. మొద‌ట శివాల‌యంలో బ‌తుక‌మ్మ ఆడ‌తారు. రెండోరోజు నుంచి వీధుల్లో, దేవాల‌యాలు, చెరువుల వ‌ద్ద బ‌తుక‌మ్మ‌ల‌ను ఉంచి వ‌ల‌యాకారంగా చేరి బ‌తుక‌మ్మలు ఆడి నిమ‌జ్జ‌నం చేస్తారు.  మొత్తం 9 రోజులు జ‌రుపుకునే ఈ పండుగ‌లో భాగంగా మొద‌టిరోజున  ఎంగిలిపూల బ‌తుక‌మ్మ అని నైవేధ్యంగా తుల‌సి ఆకులు, వ‌క్క‌లు క‌లిపి స‌మ‌ర్పిస్తారు. రెండ‌వ రోజు అటుకుల బ‌తుక‌మ్మ అని.. నైవేద్యంగా చ‌ప్పిడి ప‌ప్పు, బెల్లం, అటుకులు స‌మ‌ర్పిస్తారు.
మూడ‌వ రోజు ముద్ద‌ప‌ప్పు బ‌తుక‌మ్మ అని నైవేధ్యంగా ముద్ద‌ప‌ప్పు, పాలు, బెల్లం స‌మ‌ర్పిస్తారు. నాలుగ‌వ రోజు నాన‌బియ్యం బ‌తుకమ్మ అని.. నానేసిన బియ్యం, పాలు, బెల్లంల‌ను నైవేద్యం పెడ‌తారు. ఐద‌వ‌రోజు అట్ల బ‌తుక‌మ్మ అని.. నైవేద్యంగా అట్ల‌ను స‌మ‌ర్పిస్తారు. ఆర‌వ‌రోజు అలిగిన బ‌తుక‌మ్మ  ఈ రోజు బ‌తుక‌మ్మ అలిగింద‌ని ఆడ‌రు. ఏడ‌వ రోజు వేప‌కాయ‌ల బ‌తుక‌మ్మ అని.. నైవేధ్యంగా బియ్య‌పు పిండిని వేప‌కాయ‌ల ఆకారంలో ఉండ‌లుగా చేసి ఉడుక‌పెట్టి స‌మ‌ర్పిస్తారు. ఎనిమిద‌వ రోజు వెన్న‌ముద్ధ‌ల బ‌తుక‌మ్మ‌గా కొలుస్తారు. నైవేద్యంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం వంటివి స‌మ‌ర్పిస్తారు. చివ‌రి రోజు తొమ్మిద‌వ రోజున స‌ద్దుల బ‌తుక‌మ్మ అంటారు. నైవేధ్యంగా పెరుగ‌న్నం, చింత‌పండు పులిహోర‌, నిమ్మ‌కాయ‌ల పులి   హోర‌, కొబ్బ‌ర‌న్నం, నువ్వుల అన్నం ఈ ఐదుర‌కాల వంట‌లు స‌మ‌ర్పిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: