జలుబు చేస్తే కరోనా రాదంతే.. ఇదిగో ప్రూఫ్!

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: కరోనాకు చెక్ పెట్టే ఆయుధాల కోసం ప్రయత్నిస్తున్న నిపుణులకు ఓ కొత్త విషయం తెలిసింది. అదేంటంటే జలుబుతో  ‘జలుబుతో కరోనా అంతం చేయడమేంటి..? పిచ్చి కాకపోతేనూ..’, ‘కరోనా మొదలయ్యేదే జలుబుతో కదా..? మరి అదే జలుబుతో కరోనాను ఎలా ఓడిస్తారు..?’ అనే అనుమానాలన్నీ కలుగుతున్నా శాస్త్రవేత్తలు మాత్రం జలుబుతో నిజంగానే కరోనాను నాశనం చేయవచ్చని చెబుతున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్‌గోవ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త అధ్యయనాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. జలుబుకు కారణమయ్యే రైనో వైరస్‌కు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మధ్య పోటీపెట్టారు. ఈ పోటీలో.. జలుబు వైరస్ ఘన విజయం సాధించింది. కోవిడ్-19కు కారణమైన కరోనా వైరస్‌ను అంతం చేసేసింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

జీవపరిణామ సిద్ధాంతంలోని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సూత్రం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేశారు. కరోనా వైరస్, రైనో వైరస్‌లకు టార్గెట్ అయిన శ్వాసకోస కణజాలాన్ని సిద్ధం చేసుకుని వాటిపై ఈ రెండు వైరస్‌లను విడిచిపెట్టారు. ఈ కణజాలాన్ని ఇన్ఫెక్ట్ చేసేందుకు రెండు వైరస్‌లు ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఇందులో అనూహ్యాంగా జలుబు వైరస్సే విజయం సాధించింది. శ్వాసకోశ కణజాలాన్ని ముందుగా ఆక్రమించిన రైనో వైరస్ కరోనాకు స్థానం లేకుండా చేసింది.

అయితే శాస్త్రవేత్తలు ఈ పోటీకి మరో ట్విస్ట్ ఇచ్చి కరోనా వైరస్ శక్తి సామర్థ్యాలను పరీక్షించారు. శ్వాసకోస కణజాలంపై ముందుగా కరోనా వైరస్‌ను విడిచిపెట్టారు. దాదాపు 24 గంటలు అలా వదిలేసి తరువాత జలుబు వైరస్‌ను వదిలారు. అయితే 24 గంటల ముందుగా కరోనా స్థావరం ఏర్పాటైనప్పటికీ.. జలుబు వైరస్ చేరుకోగానే కరోనాను కొట్టి తరిమేసింది. దీంతో రైనో వైరస్ ధాటికి కరోనా వైరస్ తట్టుకోలేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే రైనో వైరస్ విజయానికి గల కారణాలను కూడా శాస్త్రవేత్తలు వివరించారు. రైనో వైరస్ ప్రవేశించగానే.. శరీరంలో రోగనిరోధక శక్తి పనిచేయడం ప్రారంభమవుతుందని, దీంతో కణజాలంలో కరోనా వైరస్ బతకలేని పరిస్థితులు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇక్కడ ఓ డ్రా బ్యాక్ కూడా ఉంది.

 రైనో వైరస్ వల్ల ఉత్పన్నమైన రోగ నిరోధక శక్తి కొంతకాలమే శరీరానికి రక్షణ కల్పిస్తుంది. అప్పటివరకు కరోనా వైరస్ పక్కన ఉంటుంది. ఎప్పుడైతే ఆ శక్తి తగ్గుతుందో వెంటనే కరోనా విజృంభిస్తుంది. దీనివల్ల కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈలోపు మాత్రం ప్రజలందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: