వందేళ్ల చరిత్ర ఉన్న పేదోడి కూల్ డ్రింక్...?

VAMSI
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి. రోజు రోజుకి ఇలాంటి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే మార్కెట్లోకి ఎన్ని కొత్త డ్రింక్స్ వచ్చినా.. మా డ్రింక్ మాత్రం ఎవర్ గ్రీన్ స్పెషల్ అంటున్నారు గోదావరి జిల్లా వాళ్ళు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి... దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోదావరి జిల్లాలో
'ఆర్టోస్‌’ సాఫ్ట్ డ్రింక్ కి పెట్టింది పేరు. ఈ  డ్రింక్ కి వందేళ్ల చరిత్ర ఉంది. అయితే ఈ కంపెనీని విస్తరించి ఈ శీతల పానీయం రుచిని ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తేవాలి అనుకున్న సంస్థ ఈ ఉగాదికి సంస్థ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఆర్టోస్‌ పరిశ్రమ ఎదుగుదల వెనక మూడు తరాల శ్రమ ఉంది.

రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. అలా మొదలైన  ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు గొప్ప స్థాయికి చేరుకుంది. ఎంతో ప్రాచుర్యం పొంది క్వాలిటీ మరియు రుచిలో జనాల మన్ననలు పొందిన ఆర్టోస్‌ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  మూడో తరం వారైన ఆర్టోస్‌ బ్రదర్స్‌ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం నాడు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వీరు... తమ నాణ్యమైన రుచిగల ఆర్టోస్‌ కూల్ డ్రింక్ ను అందరికీ అందుబాటులోకి  తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థని మరింత విస్తరిస్తున్నట్లు  పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా ఈ నూతన యూనిట్ ను ప్రారంభించారు. ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్‌ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా క్వాలిటీ లో కూడా ఎప్పటిలాగే 100% ఇస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: