స్విమ్మింగ్ పూల్‌లో జంట..ఏనుగు చేసిన అల్లరి వైరల్

Suma Kallamadi
ఏనుగులు అంటే చాలా మంది ఇష్టం. అడవిలో అతి బలమైనదిగా ఏనుగును చెబుతుంటారు. అలాంటి ఏనుగు మనుషుల మధ్యకు వస్తే భయంతో పరుగులు తీయడం ఖాయం. ఎక్కడైనా నీళ్లు ఉన్న కొలనొ లేక చెరువో, వాగు ఇలాంటివి కనపడితే చాలు..ఆ ఏనుగులకు ఇక పండగే. ఆ నీళ్లలో ఈదటం అంటే ఏనుగులకు చాలా ఇష్టం. నీళ్లలో జలకాలాడుతూ తెగ అల్లరి చేస్తుంటాయి. అటువంటి సరదాతనం ఏనుగులకు ఉంటుంది. అయితే ఏనుగులకు కోపం వస్తే ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడవు. సాధారణంగా మనుషులకు కోపం వస్తే తమ ముఖంలో భావాలు మారిపోతాయి. రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారు. అయితే ఏనుగులను అలా గుర్తించలేము. తాజాగా నెట్టింట్లో ఓ ఏనుగుల వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ ఏనుగు పొదల్లోంచీ ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చింది.

ఆ సమయంలో ఆ పూల్‌లో ఓ జంట స్నానం చేస్తోంది. అనుకోని అతిథి వచ్చేసరికి వాళ్లు షాక్ అయ్యారు. "వామ్మో అడవి ఏనుగు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, కదిలితే అది వెంట పడుతుందేమో. పారిపోదామంటే, ఒంటిపై బట్టలు లేవు. అది ఏం చేస్తుందో, ఏమో ఇలా బుక్కైపోయామేంటి" అని ఆ జంట టెన్షన్ పడింది. ఏనుగు ఆ జంటను పరీక్షగా చూసింది. ఆ జంట కదలకుండా బొమ్మల్లా ఉంది. ఏనుగు నీటిలో తొండాన్ని పెట్టి గుడగుడగుడగుడ అంటూ నీటిని తొండంలోకి లాక్కొని నోట్లోకి పంపుకుంది. ఇలా 2సార్లు చేసింది. ఆ జంట భయంభయంగా చూడసాగింది. దాహం తీర్చుకున్నాక ఏనుగు మరోసారి ఆ జంట వైపు అదోలా చూసింది. ఆ జంట "ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్" అని బతిమలాడుతున్నట్లు ఉంది. ఏనుగు వారిపై జాలి పడి వదిలేసి తన దారిన తాను అడవిలోకి వెళ్లిపోయింది. దాంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. 2010లో జరిగిన ఈ ఘటన యూట్యూబ్‌లో ఇప్పుడు వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: