సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యేందుకు కొంతమంది వికృత చేష్టలు చేస్తున్నారు. పాపులారిటీ కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియా పిచ్చి తో రకరకాల వీడియోలు చేసి జనాలను భయపెడుతున్నారు. క్రేజ్ సంపాదించుకునేందుకు ప్రాణాలకు తెగించి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. మనకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం గురించి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక ఈ షోలో వచ్చే యాంకర్ చనిపోయిన జంతువులు అలాగే బతికి ఉండే కప్పలను పురుగులను మింగేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు.
అంతే కాకుండా చనిపోయిన పాములను తింటూ వీడియోలలో కనిపిస్తాడు. దాంతో అతడికి ఎంతో మంది ఫాలోవర్స్ ఉంటారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు కూడా అలాంటి వీడియోనే తీసి పాపులర్ అవ్వాలనుకున్నాడు. తాను కూడా ఓవర్ నైట్ సెలబ్రెటీ అవ్వాలనుకున్నాడు. అందుకోసం ఆ యువకుడు మరింత ప్రమాదకరంగా బతికి ఉన్న పామును మింగేస్తూ వీడియోలో షేర్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడు బ్రతికి ఉన్న పామును కరకరా నమిలి మింగేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు యువకుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వర్షన్ అనే పేరుతో బతికి ఉన్న పామును తింటూ ఈ వీడియోను షేర్ చేశాడు.
మొదట పాము పిల్ల తలను నోట్లో పెట్టుకొని మెల్లమెల్లగా దానిని లోపలికి తీసుకున్నాడు. చూడ్డానికి భయంకరంగా ఉన్న ఈ వీడియో లో యువకుడు నవ్వుకుంటూ పామును తింటున్నాడు. అతడి స్నేహితులు కూడా అతడిని ఎంకరేజ్ చేయడం కనిపిస్తుంది. అంతేకాకుండా అతడు పాముని తింటున్న సమయంలో పాము గిలగిలా కొట్టుకోవడం తో అతడు నీళ్లు తీసుకురా సాజిత్ అంటూ గట్టిగా అరుస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను హైదరాబాద్ డిజిపికి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఫిర్యాదు చేశారు. యువకుడిని కఠినంగా శిక్షించాలని అంటూ జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.