పిల్లల ఆశపై పన్నిన దందా! కోట్లు వసూలు చేసిన 'సృష్టి' ఫెర్టిలిటీ స్కాం..!

Amruth kumar
పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఫెర్టిలిటీ కేంద్రాలు ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్న ఈ రోజుల్లో.. సికింద్రాబాద్‌లోని 'సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌' నుంచే ఓ భారీ స్కాం బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎలాంటి అనుమానం రాకుండా, శాస్త్రీయ విధానాల పేరుతో గర్భధారణ చేస్తామంటూ చెప్పి… వాస్తవానికి మాత్రం చిన్నారుల విక్రయాల  అడ్డాగా మారిందని పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్, సరోగసీ పేరుతో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేస్తూ… శిశువుల విక్రయాన్ని వ్యాపారంగా మలిచారు. దంపతుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని … వారి అండం , వీర్యం ద్వారా బిడ్డ పుడుతుందన్న నమ్మకాన్ని కలిగించి, బయట నుంచి కొన్న బిడ్డలనే డెలివరీ పేరుతో అప్పగించేవారు.


అంటే, తామిచ్చిన శిశువు వాళ్లదేనన్న నమ్మకంతో ఆ దంపతులు ఎదురు చూస్తే… కట్ చేస్తే ఓ రోజు డెలివరీ అంటూ, వేరే బిడ్డను చూపించేవారు !అంతే కాదు … సరోగసీ మాదిరిగా నటించేందుకు గర్భిణీగా ఉన్న మహిళలను చూపిస్తూ నమ్మబలికే ప్రయత్నం. మహిళలకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న దారుణం. అంతేగాక , రాజస్థాన్‌కు చెందిన ఓ దంపతులకు ఇచ్చిన శిశువును అస్సాంలోని దంపతుల నుంచి కేవలం రూ.90 వేలకు కొన్నారు అని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వీర్యం దాతలకు రూ.800 నుంచి రూ.1500, అండం ఇచ్చిన మహిళలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ కమీషన్లు ఇచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది.


సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్‌లోని ఇతర కేంద్రాలకు పంపిస్తున్నట్లు సెంటర్‌ సిబ్బంది ఒప్పుకున్నారన్న సమాచారం. ఈ శిశు వ్యాపార గుట్టు బయటపడటంతో తెలంగాణ ఆరోగ్య శాఖ దిగ్భ్రాంతికి గురైంది. ఈ వ్యవహారం పై తీవ్రంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ… బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫెర్టిలిటీ కేంద్రాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. ఒక్కో జీవితం కోసం పోరాడాల్సిన వైద్య రంగం… ఇలా వ్యాపారానికి నిలయంగా మారిందంటే బాధకరం కాదు? ఇకనైనా గట్టిగా స్పందించాలి! శిశువులను వ్యాపార వస్తువులుగా మార్చే కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవన్న స్పష్టత ఇప్పుడు ప్రజల డిమాండ్‌గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: