పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి ..!

Amruth kumar
బంగారం ధరలు ఆగడమే లేదు. ఇప్పటికే లక్ష రూపాయల గోడ దాటిన బంగారం ధరలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. మార్కెట్ నిపుణులు చెబుతున్న అంచనాలు నిజమవుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కాబట్టి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయని భావించిన వినియోగదారులకు ఈ ధరలు పెద్ద షాక్ గా మారాయి. గత కొద్ది రోజులుగా ధరల్లో ఎత్తుపల్లాలు కనిపించినా.. చివరికి బంగారం ధర మళ్లీ దూసుకుపోతోంది. మూడు రోజుల క్రితం కొంత తగ్గినట్టే అనిపించింది కానీ మళ్లీ ఒక్కసారిగా పెరిగి, వినియోగదారులపై భారాన్ని మోపేస్తోంది. ఈ స్థాయిలో ధరలు పెరగడంతో పది గ్రాముల బంగారం కొనాలంటే లక్ష రూపాయలకుపైగానే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది సాధారణ కుటుంబాలకు అందని ద్రాక్షలా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆగడంలేదు.

అంతర్జాతీయ మార్కెట్ లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం.. ఇవన్నీ కలసి ధరలను మంట పెట్టిస్తున్నాయి. దీంతో బంగారం, వెండి వస్తువులు అందుబాటులోకి రావడం లేదు. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదైన ధరలు షాక్ కు గురి చేస్తున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర: రూ .96,200 , 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర: రూ.1,04,950 , కిలో వెండి ధర: రూ .1,31,000 . ఈ సంఖ్యలు చూసిన వినియోగదారులు ఒక్కసారిగా కొనుగోళ్లు తగ్గించేస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ ఉన్నా.. ప్రజలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. “ముందు బంగారం ధరల పెరుగుదల ఒక స్థాయికి ఆగిపోతుందని అనుకున్నాం.. కానీ ఈసారి మాత్రం ఆగడం లేదు.

మధ్యలో బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది” అని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం పెరిగి వెండి పెరగకపోవడం అసాధ్యం. అందుకే రెండింటి ధరలు సమానంగా దూసుకుపోతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో కూడా ధరలు స్థిరపడే అవకాశం తక్కువగానే ఉంది. దీనివల్ల వినియోగదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒకప్పుడు పెట్టుబడిగా, భద్రత కోసం కొనేవారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు అంత దూసుకుపోవడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు “బంగారం కొనడం కంటే ఇల్లు కొనడం చవకగా ఉందేమో” అనే స్థితికి వచ్చేశాయి. ఈ దూకుడు కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం కొనుగోళ్లు మరింత తగ్గిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: