గోవా నైట్‌క్లబ్‌లో ఊహకందని విషాదం: 23 మంది మృతి అసలు కారణం ఏంటి?

Amruth kumar
విందులు, వినోదాలకు స్వర్గధామంగా, పర్యాటక ప్రియుల కలల లోకంగా కనిపించే గోవాలో గత రాత్రి ఊహకందని విషాదం చోటుచేసుకుంది. పార్టీలు, పబ్బులతో నిత్యం కళకళలాడే ఈ ప్రాంతం ఒక్కసారిగా పెను విషాదంలో మునిగిపోయింది. ఉత్తర గోవాలోని బాగా బీచ్ సమీపంలోని అర్బోరాలో ఉన్న 'బిర్చ్ బై రోమియో లేన్' అనే నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఏకంగా 23 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. రాత్రిపూట విందులతో, డాన్స్‌లతో సందడిగా ఉన్న ఈ క్లబ్‌లో ఉన్నట్టుండి మంటలు లేవడం, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో లోపల ఉన్నవారు ప్రాణ భయంతో అల్లాడిపోయారు. క్షణాల్లోనే మంటలు క్లబ్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఆ ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. భవనం నుంచి అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్న తీరు స్థానికులను, చూసినవారిని భయాందోళనకు గురిచేసింది.



సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ దారుణ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వంటగది ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకోవడంతో, ప్రమాదానికి ప్రధాన కారణం సిలిండర్ పేలుడు అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరణించిన 23 మందిలో అధిక శాతం మంది నైట్‌క్లబ్ సిబ్బందే ఉండటం అత్యంత విషాదకరం. ముఖ్యంగా వంటగదిలో పనిచేసే కార్మికులు, ముగ్గురు మహిళలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ స్పష్టం చేశారు. మెట్ల మార్గం వద్ద కూడా రెండు మృతదేహాలు లభించాయి. సిబ్బంది నిర్లక్ష్యమా? లేక యాజమాన్యం తప్పిదమా? అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘోర ప్రమాదంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. పండుగ వాతావరణంలో ఉండాల్సిన గోవాలో ఈ విషాదం తీవ్ర ఉద్రిక్తతకు, శోకానికి దారితీసింది. మృతుల కుటుంబాల రోదనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ మారణహోమానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: