బావిలో చిక్కుకున్న యువకుడు.. రెండు గంటల పాటు హృదయవిదారక ఘటన..!
కోతులు వెంటాడుతుండటంతో ప్రాణభయంతో పరిగెత్తిన ఆ యువకుడు, అదుపు తప్పి నేరుగా బావిలోకి పడిపోయాడు. బావిలో నీరు ఉండటం, లోతు ఎక్కువగా ఉండటంతో ఆ యువకుడు బయటకు రాలేకపోయాడు. బావి లోపల ఉన్న గట్టును పట్టుకుని ప్రాణాల కోసం కేకలు వేశాడు. ఆ కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని, విషయాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు.యువకుడు బావిలో పడిపోయాడని తెలియగానే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్, స్థానికుల సహాయంతో అతి కష్టం మీద యువకుడిని బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఆ యువకుడికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలైన ఆ యువకుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లోని జనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ఇంట్లో ఉన్నా, బయటకు వచ్చినా కోతులు వదలడం లేదు. పిల్లలను స్కూల్‌కు పంపాలన్నా, పొలం పనులకు వెళ్లాలన్నా భయమేస్తోంది" అని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కోతుల నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. కోతులను పట్టుకుని అడవిలోకి వదలాలని, లేదంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బావిలో పడాల్సిన పరిస్థితి రావడంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అదృష్టం బాగుండి ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, ఒకవేళ బావిలో నీళ్లు లేకపోయినా లేదా సమయానికి ఎవరూ గమనించకపోయినా పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తు వీడి కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని వరంగల్ ప్రజలు కోరుకుంటున్నారు.